నల్గొండ జిల్లా:
బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు సేకరించిన భూమి, చెల్లింపులు, పెండింగ్ భూసేకరణ తదితర సమగ్ర వివరాలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లేముల రిజర్వాయర్, పంపు హౌస్‌లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ముందుగా రిజర్వాయర్ వద్దకు చేరుకున్న కలెక్టర్, బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు ద్వారా అందిస్తున్న సాగునీరు, ఇప్పటి వరకు పూర్తయిన పనులు, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, భూసేకరణకు ఇప్పటి వరకు చేసిన చెల్లింపుల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ బద్రు, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, భూసేకరణ కింద ఇప్పటి వరకు చేపట్టిన పనులు, చెల్లించిన పరిహారాలు, ప్రాధాన్యత క్రమంలో చెల్లించాల్సిన పెండింగ్ చెల్లింపులు, అందుబాటులో ఉన్న నిధులు, ఇంకా పరిష్కరించాల్సిన అంశాలపై సమగ్ర నివేదికను తక్షణమే సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పంపు హౌస్‌ను పరిశీలించి, అక్కడ జరుగుతున్న పనులు, యంత్రాల స్థితిగతులు, నిర్వహణ అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ చంద్ర, డీఈలు పిచ్చయ్య, మారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from blueviolet-salmon-673843.hostingersite.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments